“కలవరపడకుడి శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, సమాధిలో లేడు” (మార్కు 16:6)
“ప్రేమ ఆశక్తి కలిగిన విశ్వాసులు
“దేవునియందు భయభక్తులు కలిగి యేసుప్రభువును ప్రేమించే ముగ్గురు స్త్రీలను మార్కు 16వ అధ్యాయంలో చూస్తాము. వారెవరనగా – ‘మగ్దలేనే మరియ’, ‘యాకోబు తల్లి అయిన మరియ’, ‘సలోమే’ (మార్కు 16:1). సమాధిలో పెట్టబడిన యేసుప్రభువు దేహమును సిద్ధపరుచుటకొరకు ఆ స్త్రీలు ఖరీదైన సుగంధద్రవ్యములు కొనుట వారి ‘మూల్యంచెల్లించే వెలకట్టకలిగిన ప్రేమ’ కు నిదర్శనం (మార్కు 16:2). వారు పెందలకడనే లేచి ప్రభువు సమాధి దగ్గరకు బయలుదేరుట ప్రభువు మీద వారికున్న ఆప్యాయతకు మరియు ఆశక్తికి నిదర్శనం (మార్కు 16:3). దేవుడు క్రీస్తుద్వారా చూపిన అమూల్యమైన వెలకట్టలేని ప్రేమను గుర్తు చేసుకొంటూ మానవులుగా వెలకట్టకలిగిన ప్రేమచూపుతూ త్యాగపూరితముగా దేవునికి ఇచ్చినప్పుడు దేవునికి ప్రియులమగుదుము. మరియు దేవుని ఆలయమునకు ఆశక్తితో పెందలకడనే వచ్చి ‘అమూల్యమైన సమయము అనే వెల’ చెల్లించే వారిని దేవుడు ఆశీర్వదించును అనే సత్యములను ఈ పునరుత్థాన మాసమందు మరొకసారి దేవుడు మనకు గుర్తుచేస్తున్నాడు.
“విశ్వాసుల క్లిష్టసమస్యలను తొలగించే దేవుడు
“సమాధికి అడ్డుగా పెట్టబడిన పెద్ద రాయిని ఎవరు పొర్లించుదురు అని తమ బలమును ప్రశ్నించుకొంటున్న బలహీనులైన స్త్రీలకు దేవుడు బలమైన దేవదూత ద్వారా ఎంతో పెద్దదైన రాయిని సునాయాసముగా తీసివేసెను (మార్కు 16: 4).
దేవునియందు ప్రేమ ఆశక్తి కలిగియున్న విశ్వాసులకు వారి బలహీనతలయందు దేవుడు తానే తన బలముద్వారా సహాయము చేయును అనే సత్యమును ఈ పునరుత్థాన మాసమందు మరొకసారి దేవుడు మనకు గుర్తుచేస్తున్నాడు. “నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అన్న పౌలు మాటలు గుర్తు చేసుకుందాము (2 కొరింథీ. 12:10). మరియు ప్రభువు పరిచర్య పట్ల ప్రేమ ఆశక్తి కలిగి యందాం.“విశ్వాసుల కలవరమును పునరుత్థాన శుభవార్త ద్వారా తొలగించే దేవుడు
“అందుకా దేవదూత – “కలవరపడకుడి శిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; ... మీకు ముందుగా చెప్పిన రీతిగా మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెను; మీరు ఆయనను అక్కడ చూతురు” అనెను (మార్కు 16: 6-7). ‘ఏసుప్రభువు సమాధిలో లేడు; ఆయన మరణమును జయించి పునరుత్థానుడై లేచాడు’ అన్న శుభవార్త మన జీవన్మరణములయందున్న ప్రతి కలవరమును తొలగిస్తుంది. బ్రతికియుండగా జీవితములోనున్న ప్రతి కలవరముయందును శ్రమయందును పునరుత్థానుడైన యేసు మనతో వున్నాడు అనే భరోసా మరియు ఆదరణ మనము కలిగు యున్నాము (2 కొరింథీ. 1: 8-10). మనం మరణించినను యేసు వాలె మనము కూడా జీవించెదము అన్న యేసు వాగ్దానం మనకు ఎంతో ఆదరణకరమైనది (యోహాను 14:19). మరియు మనం మరిణించిన తరువాత పునరుత్థానం పొంది నిత్యజీవముతో ఆయనతో సదాకాలము జీవించెదము అన్న పునరుత్థాన నిరీక్షణ మనకు మరింత ఆదరణకరమైనది (1 ధేస్స. 4: 16-17). ఆమెన్
ప్రేమతో మీ సంఘకాపరి