“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా. 1:16)

‘దేవుడు మనలను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును భూలోకమునకు పంపి, మన పాపములు యేసు మీద మోపి, యేసు మరణ పునరుథానం ద్వారా మన పాపములను దేవుడు క్షమించి మనలను నరకమునకు పోకుండా రక్షించాడు’ – అన్నదే ‘సువార్త’ కదా!

అపోస్తలుడైన పౌలు అట్టి ‘సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను’ అంటున్నాడు. సువార్తను గూర్చి ఎందుకు సిగ్గుపడాలి? దానినుంచి వచ్చే అవమానం గురించేకదా! ఆనాడు పౌలును అనుకొన్నట్లు మనలనుకూడా అందరూ, వెఱ్రివారు అనుకుంటారు (1 కొరింథీ. 1:20-25). మరియు మనలను చూచి నవ్వుకుంటారు (అపో. 17:31-34) అనేగదా మన భయం! కానీ యేసుక్రీస్తును మనము బాహాటముగా అంగీకరించనియెడల అయనగూర్చిన సువార్తను ప్రచురించని యెడల మనము ఎంత అవమానమునకు లోనవుతామో ఆలోచించారా? యేసు ప్రభువు అంటున్న మాటలు – “మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును ఎరుగనందును” (మత్తయి 10:33). మరియు “నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో, వానిని గూర్చి మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగాలవాడై పరిశుద్ద దూతలతో కూడా వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను” (మార్కు 8:38).

సువార్త ప్రకటించుట ద్వారా మనకు శ్రమ కలుగుతుందనే కదా మన భయం! ఆనాడు పౌలుకు సువార్త ప్రకటించుట వలననే శ్రమలు (2 తిమో. 1:11-12; 2:8-9). కానీ పౌలు అంటున్నాడు – “సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడియున్నది. అయ్యో, సువార్త ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ” (1 కోరింథీ. 9:16). సువార్త వలన తనకు అనేక శ్రమలు వచ్చినప్పటికి పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ అంటున్నమాటలు – “దేవుడు మనకు పిరికితనముగల ఆత్మ నియ్యలేదు, కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదినైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములో పాలివాడవైయుండుము” (2 తిమో. 1:8).

కావున, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని సంఘమా, సువార్త ప్రకటించుట అన్నది మన మీద పెట్టబడిన బాధ్యత. దానిని నేరవేర్చిన యెడల మనకు మన కుటుంబాలకు అశీర్వాదం.

ప్రేమతో మీ సంఘకాపరి,
కే. వెంకటేష్ పాల్