క్రొత్త సంవత్సరములో క్రొత్త నిబంధన ఆశీర్వాదములు
(యిర్మీయా 31: 31-33)

“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 31:31)

దేవుడు పాత నిబంధనను మోషే ద్వారా దేవుని ప్రజలతో చేసియుండగా, క్రొత్త నిబంధనను యేసు క్రీస్తు ద్వారా దేవుని ప్రజలతో చేసియుండెను (మత్తయి 26:28). తన పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తును రక్షకునిగా నమ్ముకున్న ప్రతి ఒక్కరికి క్రొత్త నిబంధన ఆధారంగా, దేవుని ఆశీర్వాదాలు వర్తిస్తుంది (హెబ్రీ. 9:15).

“అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు; నేను పెనిమిటినైనను వారు పాత నిబంధనను భంగము చేసికొనిరి; ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 31:32)

‘ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన పాత నిబంధన’ అన్న వాక్యం – అయోగ్యులము అపాత్రులము అయిన మనలను దేవుని కృప ద్వారా గతములో దేవుడు చేయి పట్టుకొని నడిపించి కాచికాపాడిన విధానం మరియు భయంకరమైన తెగులు సంవత్సరములో మనకు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము, కాపుదల, భద్రతను గుర్తుచేస్తున్నది.

‘నేను పెనిమిటినైనను వారు పాత నిబంధనను భంగము చేసికొనిరి’ అన్న వాక్యం – మనము దేవునితో సరిగా లేనందువలన, ఆయనకు లోబడనందువలన విఫలమైన మన గత ఆత్మీయ జీవితమును మరియు గత సంవత్సరంలో పొందుకోలేక కోల్పోయిన అశీర్వాదాలను గుర్తుచేస్తున్నది.

“ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి వుంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే.” (యిర్మీయా 31:33)

దేవుని ప్రజలు తమ పాపము వలన బలహీనులై మరియు మనవ స్వశక్తితో ప్రయత్నించి దేవునిని తృప్తిపరచలేక విఫలమైనదే పాత నిబంధన. కానీ, క్రొత్త నిబంధన ఆధారంగా, యేసుక్రీస్తు మరణ పునఃరుద్ధానముల ద్వారాను మరియు దేవుడు అనుగ్రహించిన పరిశుద్దాత్మ శక్తి ద్వారాను దేవుని ప్రజలమైన మనము దేవుని తృప్తిపరచే ప్రీతికరమైన జీవితాలు జీవించగలము అన్న ఆదరణ దేవుడు మనకు ఇస్తున్నాడు (రోమా 8:11). మనము ఎడతెగక వాక్యధ్యానములోను, అనుదిన ప్రార్థనలోను కొనసాగుతూ వుండగా, క్రొత్త నిబంధన ఆశీర్వాదములు దేవుడు మనకందరికీ ఈ క్రొత్త సంవత్సరం దయచేయునుగాక. ఆమెన్.

మీ సంఘకాపరి
రెవ. కే. వెంకటేష్ పాల్