“శోధన సహించువాడు ధన్యుడు; అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్ధానము చేసిన జీవకిరీటము పొందును” (యాకోబు 1:12)
పరిశుద్ధగ్రంధం అంటున్నది – “దేవుడు ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినపుడు – నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును” (యాకోబు 1:13-14)
శోధనలకు పరిమితినిచ్చే దేవుడు – దేవుని పరిమితి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. దేవుడు శోధనలకు కారకుడు కాదుగానీ, మన స్వకీయపాపప్రవృత్తి వలన సాతాను మన జీవితాలలో తెచ్చే శోధనలకు దేవుడు పరిమితిని ఇచ్చేవాడు (యోబు 1-2).మన జీవితములో శోధన వచ్చినప్పుడు, దేవుడు ఆ శోధన ద్వారా మనలను పరిశోధించును. మనము ఆ శోధనల ద్వారా ప్రక్షాళన పరచబడి విజేయులుగా బయటకు వచ్చి అశీర్వాదాలకు పాత్రులు కావాలన్నది దేవుని సంకల్పం. కానీ, సాతాను సంకల్పమైతే మనము ఆ శోధనల ద్వారా విఫలమై దేవుని అశీర్వాదాలు కోల్పోవాలని. ‘శోధన సహించువాడు ధన్యుడు’ అన్న వాక్యం యోబునకు వర్తింపబడి ఆశీర్వాద కారణమాయెను (యోబు 42: 12-16). యోబు శోధనలయందు మనకు మాదిరి ఆయెను.
శోధనల ద్వారా పరిశోధించే దేవుడు – అబ్రహామును తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు అతని హృదయమును పరిశోధించి పరిశీలుస్తున్నాడు (ఆది. 22: 1-2). ఆ పరీక్ష అబ్రహాముకు శోధన; కానీ దానియందు సహించి గెలిచినప్పుడు – “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వేనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను” (ఆది. 22:12). ‘శోధన సహించువాడు ధన్యుడు’ అన్న వాక్యం అబ్రాహామునకు వర్తింపబడి ఆశీర్వాదముగా సంతరింపబడినది (ఆది. 22: 16-18). అబ్రహాము విధేయత ద్వారా శోధనలు జయించుటయందు మనకు మాదిరి ఆయెను
మరియు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన పాపముల కొరకు ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఆ సాతాను శోధనలను వాక్యాధారముతో జయించి నీకు నాకు మాదిరిగా నిలబడి, మనము యే విధముగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనో తెలిపెను (మత్తయి 4: 1-10). కావున యేసుక్రీస్తు వాక్యాధారముద్వారా శోధనలు జయించుటయందు మనకు మాదిరి ఆయెన.
శోధనలయందు కాపాడే దేవుడు – మన దేవుడు శోధనల యందు కాపాడే దేవుడు అని అపోస్తలుడైన పౌలు నొక్కివక్కాణిస్తూ ఇస్తున్న హెచ్చరికతో కూడిన ప్రోత్సాహం మరియు ఆదరణ గమనార్హం (1 కొరింథీ 10: 12-13).
మనకిస్తున్న హెచ్చరిక – “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” (1 కొరింథీ 10:12)
మనకిస్తున్న ప్రోత్సాహం మరియు ఆదరణ – “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింప గలిగినంతకంటె ఆయన మిమ్మును శోధింపనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గము కలుగ జేయును” (1 కొరింథీ. 10:13). ఆమెన్
ప్రేమతో మీ సంఘకాపరి