పరిశుద్ధ గ్రంధంలో ‘తెగుళ్ళు’ (plagues) గురించి చూచినపుడు, దేవుడే వాటిని మానవుల మీదికి పంపినట్లు గమనిస్తాము. అవి పాపములోవున్న మానవాళిని శిక్షించుటకును, బుద్ది చెప్పుటకును. ఉదాహరణకు, ఇగుప్తు పది తెగుళ్ళు (నిర్గ. 7-11), మరియు ఆఖరి దినములలో వచ్చు తీర్పు తెగుళ్ళు (ప్రక. 8-9). ప్రస్తుత ‘కరోనా’ కూడా అటువంటి తెగులే.
ఆనాటి ఇగుప్తు తెగుళ్ళు – ఆనాటి ఫరో చక్రవర్తి మరియు అతని అధికారులు తమ పాపములను ఒప్పుకొనక మరియు నిజమైన దేవుడైన యెహోవాను ఆశ్రయించక పోయినందున, ఆ తెగుళ్ళ వలన తమ ఆస్థిపాస్తులను, తమ సర్వస్వమును, తమ జేష్టపుత్రులను, ఆఖరికి తమ ప్రాణములను సైతం కోల్పోయినట్లుగా చూస్తాము (నిర్గ. 12: 29-30; 14: 26-31). అదే సమయంలో దేవుడు ఇశ్రాయేలీయులు నివసిస్తున్న గోషేను ప్రాంతమును ప్రత్యేక పరచి తెగుళ్ళనుంచి కాపాడినట్లుగా చూస్తాము (నిర్గ. 8:22; 9: 4-6,26; 10:23; 11: 4-7). ఇగుప్తు మొదటి సంతానమును హతమారుస్తున్న సంహారకుడు పస్కా బలిపశువు యొక్క రక్తం పూయబడిన ఇశ్రాయేలీయుల గుమ్మములను దాటిపోయినట్లుగా, మరియు వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తాము (నిర్గ. 12: 12-13, 23). అలాగుననే ఈనాడు మన మధ్యన వికట్టాట్టహాసం చేస్తూ తారతమ్యం లేకుండా సంహరిస్తూ ఉన్న ‘కరోనా’ తెగులు నుండి పస్కా బలిపశువుగా తనను తాను సమర్పించుకున్న పునరుత్థానుడైన యేసు క్రీస్తు రక్తప్రోక్షణ తప్ప మరి ఏది కూడా మనలను రక్షించలేదు (1 కొరింథీ. 5:7).
ఎడారిలో ఆనాటి తెగుళ్ళు – దేవుడు తన ప్రజల పాపమును సైతం శిక్షించుటకు వెనుకాడడు వారి మీదికి తెగుళ్ళు పంపగలడు అన్నది శోచనీయం. మరియు దేవుడు తనవారిని ప్రక్షాళన పరిచి పరిశుద్ద పరుచుటకు తెగుళ్ళను ఉపయోగించుకొనును అన్నది గమనార్హం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల ఎడారి ప్రయాణంలో దేవునికి విరుద్ధంగా నడిచినపుడు తెగుళ్ళ వలన ఎంతో మంది మరణించారు. ఉదాహరణకు కొన్ని తెగుళ్ళ ఉదంతాలు – ఆహారోను బంగారు దూడ విగ్రహారాధన ఉదంతం (నిర్గ. 32:35). ఇశ్రాయేలీయులు దేవునికి విరుద్ధంగా సణిగి మాంసం ఆశించిన ఉదంతం (సంఖ్య. 11: 18-20, 33). దేవుని ఆజ్ఞను దిక్కరించి అవిధేయత చూపిన ఉదంతం (సంఖ్యా. 14: 36-38). దేవుని అధికారమును ఆయన సేవకులను తిరస్కరించిన ఉదంతం (సంఖ్యా. 16: 46-50). విచ్చలవిడిగా తిని తాగి లైంగిక సంపర్కాలకు పాల్పడిన ఉదంతం (సంఖ్యా. 25: 8-9). పైన చెప్పబడిన తెగుళ్ళన్నిటిలో ఎంతోమంది దేవుని ప్రజలు అనబడిన వారు మరణించారు. వారి మరణం ద్వారా మిగతావారు శిక్షణ పొంది ప్రక్షాళన పరచబడి పరిశుద్దత వైపు నడిచారు.
ప్రస్తుత ఆదరణ – మంచి క్రైస్తవ విశ్వాసులు సైతం ‘కరోనా’ తెగులు వలన అర్థాంతరంగా చనిపోతున్న ఈ సమయంలో మనం ఏలాగున దేవుని చిత్తం అర్థం చేసుకోవాలి మరి ఆదరణ పొందాలి? మనము పశ్చాత్తాపపడి మారుమనస్సు పొంది దేవునివైపు తిరిగినయెడల దేవుడు ఈ తెగులును తీసివేయును (2 సమూ. 24: 13-25). ఉదాహరణకు దావీదు అరౌనా కళ్లము వద్ద చేసిన పాపపు ఒప్పుకోలు, విజ్ఞాపన ప్రార్థనను (2 సమూ. 24:17) ఆలకించి దేవుడు కరుణించి, తెగులు ఆపుట మనం చూస్తాము (2 సమూ. 24:25). అలాగుననే ఈ తెగులు సమయంలో అందరి కొరకు మరి ముఖ్యంగా శరీరానుసారముగా నడుచుకొను క్రైస్తవ విశ్వాసుల పాపక్షమాపణ కొరకు మరియు మారుమనస్సు కొరకు ప్రార్థన చేయవలసి యున్నది. మరియు ఈ తెగులు సమయంలో ఆత్మీయమైన క్రైస్తవ విశ్వాసుల అకాల మరణములయందు ఊరట ఓదార్పు ఆదరణ ప్రకటన గ్రంధం నుండి పొందుకోగలము (ప్రక. 6: 9-11; 7: 15-17; 14: 13-14). ఆమెన్
మీ సంఘ కాపరి